అయ్యప్ప స్వామి వ్రత దీక్ష అనేది కేవలం ఒక ఆచారం కాదు — అది భక్తుని జీవితాన్ని పవిత్రత, నియమం, మరియు ఆత్మ నియంత్రణతో మలచే ఆధ్యాత్మిక సాధన. ఈ దీక్షను స్వీకరించుటవలన భక్తుడు తన శరీరము, మనస్సు, మరియు ఆలోచనలను స్వామి అయ్యప్పకు సమర్పించుకొనుచు, లోక వ్యామోహములను విడచి, దైవభక్తి మార్గమున నడుచుటకు సిద్ధమవుతాడు.
దీక్ష సమయంలో ప్రతి భక్తుడు “అహం అయ్యప్ప స్వామి” అని భావించి, వినయం, నియమం, భక్తి, మరియు సమానత్వాన్ని పాటించవలెను. భోజనం, మాట, ప్రవర్తన, నడవడి, ప్రతి అంశములో పవిత్రతను కాపాడుకోవడం వలన ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది.
క్రింద ఇవ్వబడిన పద్ధతులు అయ్యప్ప స్వామి వ్రతదీక్షలో భక్తుడు కచ్చితముగా పాటించవలసిన 18 నిబంధనలు.
అయ్యప్ప స్వామి వ్రత దీక్ష నిబంధనలు
- ప్రతిదినము ప్రాతఃకాలమున, సంధ్యా సమయమున చన్నీట శిరః స్నానమాచరించి విభూతి, గంధము, కుంకుమతో నుదుట బొట్టు ధరించుకొనవలయును. బొట్టు లేక అయ్యప్పలెప్పుడూ యుండకూడదు.
- స్వామిని రెండుపూటలా విధిగా శక్తికొలది సేవించిన తదుపరి ఆహార పానీయములు సేవించవలెను.
- సాత్వికాహారము నియమముగా పరిమిత ఆహారమునే భుజింపవలయును. మద్యము, నీరుల్లి, వెల్లుల్లి, తాంబూలము, ధూమపానము, మాంసము సేవింపరాదు. రజోగుణము వృద్ధిచేయు ఉప్పు, కారమును తగ్గించవలయును. ఒక పర్యాయము భోజనము, రెండు పర్యాయములు అల్పాహారము శుచిగా శుచియైన వారు పచనము (తయారు) చేసిన పదార్ధములనే భుజింపవలయును.
- మనోవాక్కాయ కర్మలయందు కఠోర బ్రహ్మచర్యమును పాటించవలయును.
- స్త్రీలను ఋతుకాలము నందు (బహిష్టు) చూచుటయును, మాట్లాడుటయును కూడదు. తెలిసో తెలియకో అట్లగుటయైన వెంటనే చల్లని నీటితో శిరఃస్నానమాచరించి, కర్పూరజ్యోతి వెలిగించి, శరణుఘోష చేయవలెను. మాలకు హారతి తీసుకొనవలెను.
- శవమును చూచుట లేక అపర కర్మలలో పాల్గొనరాదు. ఆత్మీయులెవరైననూ మృతిచెందిన అపర కర్మలలో పాల్గొనుట అనివార్యమైన పక్షమున, ఆ సంవత్సరం యాత్రను మానుకొని, గురువు గారి ఆదేశానుసారము మాలను తీసి స్వామివారికి అలంకరించి, పూజ ముగించి యీ మరుసటి సంవత్సరము తప్పక యాత్ర చేయవలయును.
- మాల ధరించిన పిదప ఎట్టి పరిస్థితులందునూ మాలను తీయుటకుగాని, మాలకు హాని కలుగు పరిస్థితులు కల్పించుటకాని కూడదు. మాలను జాగ్రత్తగా కాపాడుకొనవలయును.
- నల్లని దుస్తులనే ధరించవలెను. చిన్నవారు ప్యాంటు, చొక్కా - పెద్దవారు లుంగీ, లాల్చీ నల్లనివి ధరించవలెను. అయ్యప్ప భజన, పూజా, భోజన సమయములందు తప్పనిసరిగా చొక్కాను ధరించరాదు.
- గోళ్ళు కొరుకుట, తీయుట పనికిరాదు. పాదరక్షలు ధరించరాదు, క్షురకర్మ పనికిరాదు.
- మలమూత్ర విసర్జన అనంతరము శిరఃస్నానమాచరించవలెను. సాధ్యమైనంతవరకూ శుచిగా నుండి ఎల్లప్పుడూ శరణుఘోషయే తప్ప ఇతర ధ్యాసలకు తావీయరాదు.
- అయ్యప్ప తనని అయ్యప్పగానూ ఇతరులను అయ్యప్పగాను భావించవలెను. స్త్రీలను మాతృ, సోదరీ స్వరూపులుగా నెంచి వారిని “స్వామి” అని “అయ్యప్ప” అని, ఆడవారిని (భార్య) “మాలికా పురం” అని సంబోధించవలెను. అసభ్యకరమైన భాషణ చేయ కూడదు. “మానవసేవయే మాధవసేవ” యని తలచి ప్రవర్తించవలయును.
- మాలను ధరించిన దగ్గరనుండి మాలను తొలగించు వరకూ అయ్యప్పలకు ఏవిధమైన అంటరానితనమూ లేదు (అంటే అంటు, మైల, పురుడు యిత్యాదులుండవు).
- విలాస వ్యవహారములు త్యజించవలెను. విలాసముగా తిరుగుట, అత్తర్లు, సెంట్లు వగైరా సువాసన తైలములు వాడుట, చీట్లపేకాట గల జూదము లాడుట, పరుపు-దిండ్లు మొదలగునవి వాడరాదు. దీక్ష కొరకు ప్రత్యేకించి ఏర్పరచుకొన్న దుప్పటిని మాత్రమే నేలపై పరుచుకుని నిద్రించుటకు వాడుకొనవలయును. వాటిని యితరముగా ఉపయోగించెడి వస్త్రములతో కలుపక వేరుగా వుంచుకొనవలెను.
- అయ్యప్పను ఎవరైననూ సద్దికిగాని, బిక్షకు గాని ఆహ్వానించిన నిరాకరించుట తగదు. తరతమ వర్ణ భేదమును పాటించక వెళ్ళవలయును. దీక్షా కాలములో కనీసము అయిదు పూజా భజన కార్యక్రమములలో పాల్గొనవలెను.
- అసత్యమాడరాదు. హింసాకార్యము లొనర్చరాదు. వీలైనంతవరకూ లౌకిక వ్యవహారములకు దూరముగా నుండి సత్సాంగత్యము చేయుట మంచిది.
- పురాణ కాలక్షేపము, దేవతా దర్శనము, తీర్థయాత్ర వంటి పుణ్యకార్యము లాచరించుట అత్యుత్తమము.
- ఏకభుక్తం, భూశయనం, ఉదయ సంధ్యల దేవతార్చన, స్నానానంతరం తిలకధారణ, శరణుఘోష, పరిమిత సాత్వికాహారము, కఠిన బ్రహ్మచర్యము పాటించవలెను.
- మద్య, మాంసభక్షణ, జూదము, ధూమపానాది వ్యసనములు, క్షురకర్మ, గోళ్ళు గిల్లుట, అసభ్య వాచాలత, పాదరక్షల ధారణ, పరులకు బాధ కలిగించెడు తీరున ప్రవర్తించకూడదు
ఈ నిబంధనలు పాటించుట వలన అయ్యప్ప భక్తుడు తపస్సు జీవితాన్ని గడుపుతాడు. వ్రతకాలములో ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ, అయ్యప్ప స్వామికి అర్పణమవుతుంది.
ఈ నియమములను కచ్చితంగా ఆచరించినవారికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. భక్తి, వినయం, సమానత్వం, దయ, శాంతి — ఇవే అయ్యప్ప వ్రతదీక్ష యొక్క మూల సూత్రములు.
వ్రత కాలం ముగియునపుడు “స్వామీ శరణం అయ్యప్ప” అని భక్తితో నినదిస్తూ స్వామి దర్శనం పొందిన భక్తుడు పునీతుడై తిరిగి గృహస్థ జీవితమునకై సద్భావముతో నడుచును.
స్వామీ శరణం అయ్యప్ప 🙏



